Pages

Subscribe:

Thursday, November 1, 2012

కృతి సమర్పణ సన్నాహము

 ఈ టపాలో పద్యాలన్నీ పాడింది లంకా గిరిధర్.


కృతిపతి రఘునాథ మహారాజు గుణగణాలు వర్ణించిన తర్వాత కవి తన కృతి సమర్పణకు సన్నాహాలు మొదలుపెట్టాడు.. ఇక్కడ మహారాజు కూడా కవిని ప్రశంసించాడు తర్వాత మనం విజయవిలాసం కధలోకి ప్రవేశిద్దాం...



సీ. కుందనంపుఁబసిండి కుళ్లాయిజగలపైఁ
జౌకట్లనిగనిగ ల్చౌకళింప;
హురుముంజిముత్యాలయరచట్టపై  గొప్ప
పతకంపుహారము ల్పరిఢవిల్ల;
వెలఁజెప్పరాని కెంపుల వంకజముదాడి
పీతాంబరంబుపైఁ బెరిమె నెఱప;
గబ్బిమన్నె కుమారగండ పెండారంపు
జిగి పదాగ్రంబుపైఁ జెంగలింప;

తే. దొరల మంత్రులఁ గవుల నాదరణసేయు
కరముకంకణకాంతి నల్గడల నిండ.
నిండుకొలు వుండెఁ గన్నులపండువుగను
ఠీవి నచ్యుత రఘునాథభూవిభుండు.

ఈ పద్యంలో కవి రఘునాథభూవరుడి వస్త్రధారణ, అలంకరణ ప్రీతిని, రాజఠీవిని వర్ణిస్తున్నాడు. మేలిమి బంగారంతో చేసిన తలపాగా యొక్క కాంతులమీద విలువైన ముత్యాలతో చేసిన చెవిపోగుల కాంతులు నిగనిగలాడుతూ గంతులు వేస్తుండగా, పారశీకసింధుశాఖ ప్రాంతంలోని హర్మోజ్ దేశపు శ్రేష్టములైన ముత్యాలు అమర్చి కుట్టిన చొక్కా మీద పతకములతో కూడిన రత్నహారాలు ప్రకాశిస్తుండగా, అమూల్యమైన కెంపులు తాపడం చేసి, వంకరగా ఉన్న బాకు మహారాజు ధరించిన పసుపురంగు పట్టువస్త్రము మీద ఎంతో సుందరంగా వ్యాపించగా, మన్నెపురాజుల కుమారులను జయించినవాడని తెలిపే గండపెండేరముయొక్క కాంతి కాలిమీదకు ప్రకాశిస్తుండగా, సామంత రాజులను, మంత్రులను, కవులను ఆదరించు చేతికి ధరించిన కంకణములో అమర్చిన రత్నాల కాంతులు అన్ని దిక్కులకు వ్యాపించగా రఘునాథమహారాజు ఎంతో ఠీవిగా, కన్నులవిందుగా ఉన్నాడు.



ఉ. శ్రీరసభావముల్ వెలయఁ జెప్పి ప్రబంధము లెన్నియేని మీ
పేరిట నంకితంబిడిన బిడ్డల నెందఱఁ బేరుపెట్టినన్
దీరునె మీఋణం? బయినఁ దెచ్చితిఁగాన్క పరిగ్రహింపుమ
య్యా రఘునాథభూపరసికాగ్రణి, మామకకావ్యకన్యకన్.

రఘునాథమహారాజు తనకు చేసిన ఆదరణకు ఎంతో ఋణపడినట్లు భావించిన కవి ఎన్ని ప్రబంధాలు రాసి అంకితమిచ్చినా, ఎంతమంది పిల్లలకు రాజు పేరు పెట్టినా, ఆ ఋణం తీరేది కాదు. అయినా తన సొంతమైన కావ్యకన్నియను రసికులలో శ్రేష్టుడైన రఘునాథ మహారాజుకు కానుకగా తీసుకొచ్చాను. పరిగ్రహింపుమని (వివాహమాడమని, చేపట్టుమని) కోరుకుంటున్నాడు. ఎంత చేసిన తీరని ఋణం కావ్యకన్నియను ఇచ్చినా కూడా తీరేది కాదు కాని మహారాజు రసికాగ్రణి కావున దాని విలువ కంటే అందులోని భక్తి విశ్వాసాలను గ్రహించి, ఆదరిస్తాడు అని చేమకూర కవి భావించాడు.



సీ. రంభ వాకిటను దోరణములు గట్టెడు
తీవర మొకకొంత దీలుపడియె;
మేనక యింటిలో మేల్కట్లు సవరించు
సంరంభ మొకకొంత సడలువాఱెఁ; 
గనకాంగి  యింటిలోఁ గర్పూరవేదికల్
సవరించు టొకకొంత జాగుపడియె
హరిణి బంగరుమేడ నరవిరిసెజ్జలు
నిర్మించు టొకకొంత నిలుక డయ్యె.

తే. మబ్బు గొబ్బున నీశౌర్యమహిమ వినక
తెగువతోడుత నెదిరించి తిరిగి విఱిగి
పాఱిపోయిన మన్నీలపాటు సూచి
సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక!

రఘునాథ మహారాజు మహావీరుడు. అతని పరాక్రమాన్ని లెక్కపెట్టకుండా గర్వంతో ఎదిరించే శత్రురాజులు కొద్ది సమయంలోనే ఓడిపోయి మరణించి వీరస్వర్గం పొంది తమను కలవడానికి వస్తారని స్వర్గంలో రంభ, మేనకాది అప్సరసలు ఎదురు చూస్తారంట. కాని వారి ఆశ నిరాశే అవుతుంది. రఘునాథుడి పరాక్రమానికి బెదిరి అతని ధాటికి ఆగలేక శత్రురాజులందరూ యుద్ధ రంగం విడిచి భీరులై పారిపోతున్నారు. అది చూసిన రంభ తన వాకిట్లో ద్వారానికి తోరణాలు కట్టడం నిదానించింది. మేనక తన ఇంటిలోని చాందినీలు కాస్త మెల్లగా సవరించసాగింది. కనకాంగి కూడా పచ్చకర్పూరంతో అలంకరించిన తిన్నెలను సవరించడంలో ఆలస్యమయింది. అరవిరిసిన పువులతో పాన్పులు తయారు చేయడం కూడా నిలిచిపోయింది. ఇందులోని విశేషమేమిటంటే రఘునాథుడి శౌర్యపరాక్రమములు తెలియని శత్రురాజులు అతనితో పోరుకు తలపడి చాలా త్వరగా చనిపోయి వీరస్వర్గాన్ని అలంకరిస్తారని ప్రతీతి. కాని ఆ కొన్ని నిమిషాలలో వారందరూ యుద్ధ ప్రారంభంలోనే వెనక్కు తిరిగి పారిపోవడం జరుగుతుంది. శత్రురాజులు అతని ధాటికి వెరసి పలాయనం చిత్తగించారని కవి చాలా అందంగా చెప్పాడు.



తే. "కల నయిన మిమ్ముఁ  గా కన్యుఁ గొలువ నంటి
కృతు లొకరి కీను మీకె యంకితము లంటి,
పలికిన ప్రతిజ్ఞ చెల్లింపవలదె యిట్లు?
వాఙ్నియమరూఢి నీయంత వాఁ డిఁకేఁడి?

 ఇంతవరకు కవి రఘునాథ మహారాజుని వర్ణిస్తూ పద్యరచన చేసాడని చదువుకున్నాం. కాని ఈ పద్యంలో రాజు కవిని గూర్చి చెప్పిన విశేషాలు ఉన్నాయి. కలలో కూడా మిమ్మల్నిగాక (రఘునాథుని గాక అని) వేరెవరిని కొలువను అని శపథం చేసావు. నీవు రాసిన కావ్యాలను ఇంకొకరికి అంకితం ఇవ్వను అని ప్రతిజ్ఞ చేశావు. చెప్పిన మాటను , చేసిన శపధాన్ని ఈ విధంగా చక్కగా నిలుపుకున్నావు. శబ్దప్రయోగంలో నైపుణ్యం సాధించినవారు నిన్ను మించినవారు వేరొకరు లేరు అని భావం. ఈ పద్యంలోని నాలుగో చరణం కవియొక్క ప్రధానమైన కావ్యగుణాన్ని ప్రకటిస్తుంది.



క. ప్రతిపద్యమునందుఁ జమ
త్కృతి తలుగం జెప్పనేర్తు; వెల్లెడ బెళు కౌ
కృతి వింటి మపారముగా
క్షితిలో నీమార్గ  మెవరికిన్ రాదు సుమీ
 


ప్రతీ పద్యంలో శబ్దంలోనో, అర్ధంలోనో, భావంలోనో చమత్కారముండేలా కవిత్వం చెప్పగలవు, పద, అర్ధ, రస, భావ అలంకారాది విషయాలన్నింటిలోనూ సొగసైన కావ్యాన్ని ఎన్నోసార్లు విన్నాము. దానిని ఆస్వాదించిన తర్వాత ఆధ్రలోకంలో నీ కవితా పద్ధతి ఎవరికినీ రాదు సుమా.. అభినవ భోజుడైన రఘునాథుడు చేసిద ఈ ప్రశంస చేమకూర కవికి ఒక ప్రతిజ్ఞ వంటిది అని చెప్పవచ్చు.



తే. క్షత్రధర్మమ్మెకద నీకుఁ గలది మొదలఁ
దమ్ములు సుతుల్ హితులు గూడ మమ్ముఁ గొలిచి
తిపుడు కృతియును జెప్పి మా కిం పొనర్చి
తొకటఁ గా దన్నిటను బ్రయోజకుఁడ వీవు."

మొదటినుండి నీకు ఉన్నది క్షత్రియ ధర్మమే కదా. నీ తమ్ముళ్లు, కుమారులు, స్నేహితులందరూ మా కొలువులో పని చేశారు. ఇప్పుడు నీ కావ్యాన్ని కూడా మాకు అంకితమిచ్చి మిక్కిలి సంతోషాన్ని ఇచ్చావు. ఒకటని కాదు అన్నింటిలో నీవు మాకు ప్రయోజనాన్ని చేకూర్చావు అని రాజు కవిని ప్రశంసించాడు. చేమకూర వేంకటకవి జన్మతః శూద్రుడు. కొంతకాలం తన సోదరులు, కుమారులు , స్నేహితులతో కలిసి రాజుగారి సైన్యంలో ఉండి ఆ తర్వాత రచనా వ్యాసంగం మొదలుపెట్టాడు. దీనివల్ల ఈ కావ్య రచన సమయానికి కవి కొంత వయసు మళ్లినవాడు అని తెలుస్తుంది.



ఉ. ఎందునువిద్య మేలెఱుగరెవ్వ: రెఱింగినఁ గొంతమాత్రమే;
యందును సాహితీరసమహత్త్వ మెఱుంగ; రెఱింగిరేని యా
యంద మెఱుంగలే; రెఱిఁగినప్పటికిన్ విని మెచ్చి యీయ; రె
న్నందగు నచ్యుతేంద్రరఘునాథ విభుండె ప్రవీణుఁ డన్నిఁటన్.



ఈ పద్యంలో కవి పాండిత్యాన్ని సంపూర్ణంగా గుర్తించి ఆదరించిన రఘునాథ మహారాజు సామర్ధ్యాన్ని గురించి చెప్పబడింది. దేశంలో ఎక్కడైనా చాలామందికి విద్య (కావ్య పరిచయం) గురించి తెలియదు. ఒకవేళ తెలిసినా కొంతమంది మాత్రమే ఉంటారు. ఆ కావ్య పరిచయాన్ని తెలిసిన కొద్దిమందిలో ఆ సాహిత్యంలోని రసంయొక్క గొప్పదనాన్ని తెలుసుకొనలేరు. అలా తెలుసుకొనగలిగినవారు ఉన్నా ఆ కావ్యంలోని అందాన్ని, సొగసును గుర్తించలేరు. అలా గుర్తించగలిగినా ఇతరుల కవిత్వాన్ని విని, మెచ్చుకుని బహూకరించరు. అర్ధము, రసమహత్త్వాన్ని, అందాన్ని గుర్తించి, విని, మెచ్చుకుని ఇవ్వగలిగే అన్ని విషయాలలో రఘునాథవిభుడే సమర్థుడు అని కవి భావము.



ఉ. ఇచ్చునెడన్ బదార్థ మడి గిచ్చునొ; తా దయసేయఁ కా
దనన్, వచ్చునొ; మించి యొక్కఁ డన వచ్చినఁ దా నది
యిచ్చగించునో, యిచ్చిన నిచ్చెనే; సరిగ నెవ్వరిపై దయ
 జేసెఁ జేసెనే, యచ్చతురాస్యుఁడుం దెలియఁ డచ్యుతు శ్రీరఘునాథుచిత్తమున్.
.
 
రఘునాథ మహారాజు దానం చేసేటప్పుడు ఏ వస్తువు కావాలో అని అడిగడు. ఒకవేళ ఎవరైనా తాను ఇచ్చినది కాదని అంటారేమో అన్న సంశయం లేదు. ఎవరికైనా ఇవ్వడానికైనా, ఆదరించడానికైనా స్వతంత్రంగానే ఆలోచించి, వ్యవహరిస్తాడు కాని ఎవరి సలహా తీసుకుని చేసేవాడు కాదు. చివరకు నాలుగు తలలు కల ఆ బ్రహ్మకు కూడా రాజుగారి ఆలోచన, అభిప్రాయాలు గుర్తించలేడని చమత్కరించాడు కవి..

1 వ్యాఖ్యలు:

వనజ తాతినేని/VanajaTatineni said...

జ్యోతి గారు .. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న అందరికి అభినందనలు.
ఇలా గొప్ప గొప్ప కావ్యాలని పాఠకుల దరికి చేరుస్తున్నారు.

మీ అందరి కృషి వలన భావి తరాల వారికి పూర్వ సాహితీ వైభవం అందుబాటులో ఉంటుంది మీ అందరి కృషికి ధన్యవాదములు.

Post a Comment