Pages

Subscribe:

Friday, August 31, 2012

ఇష్టదేవతా స్తుతి


ఈ టపాలోని పద్యాలన్నీ పాడింది రాఘవ...

చేమకూర వేంకటకవి ఇష్టదైవం సూర్యుడు. అతను సూర్యవరప్రసాదితుడు అని కూడా అంటారు. కాని విజయవిలాసం కావ్యాన్ని ఆరంభించేటప్పుడు మాత్రం కృతిభర్త అయిన రఘునాధరాజుకు ఇష్టదైవమైన శ్రీరామచంద్రుడిని ప్రార్ధించాడు. అసలు కవులు తమ కావ్యారంభంలో తమ ఇష్టదేవతలను మాత్రమే ప్రార్ధించాలన్న నియమమేమీ లేదు. కొందరు కవులు తమ ఇష్టదేవతలను కాకుండా కృతిభర్తల ఇష్టదేవతలను స్తుతి చేసే ఆచారం ఉంది. ఉదా:పారిజాతాపహరణంలో ముక్కు తిమ్మన తన ఇష్టదైవం ఈశ్వరుని బదులు శ్రీకృష్ణదేవరాయల ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వరుని స్తుతించాడు.
నాటకాలలో నాందీవలె కావ్యాలలో కూడా మొదటి పద్యం ఆశీర్వాదంగా కాని, నమస్కార రూపంగా కాని, కధా వస్తు నిర్దేశ రూపంగా కాని ఉండాలని పూర్వకవులు సంప్రదాయం. శ్రీకారంతో మొదలు పెడితే శుభప్రదమని అందరూ భావిస్తారు. అందుకేనేమో చేమకూర వేంకటకవి విజయవిలాసం లోని మొదటి మూడు పద్యాలు శ్రీకారంతోనే మొదలుపెట్టాడు. మూడింతలు మంచి కలగాలని కాబోలు..

శ్రీ లెల్లప్పు డొసంగ, నీ సకల ధాత్రీ చక్రమున్ బాహు పీ
ఠీ లగ్నంబుగఁ జేయ, దిగ్విజయ మీన్ డీకొన్న చందాన నే
వేళన్ సీతయు, లక్ష్మణుండుఁ దను సేవింపంగ విల్ పూని చె
ల్వౌ లీలన్ దగు రామమూర్తి రఘునా థాధీశ్వరుం బ్రోవుతన్.
రాగం : కనకాంగి ..
కవి తన కావ్యాన్ని అందుకునే రఘునాధరాజుయొక్క ఇష్టదైవం శ్రీరాముని ప్రార్ధిస్తూ మొదలుపెట్టాడు. ఒకసారి తనతో ఉండి, ఇంకోసారి లేరన్నట్టు కాకుండా ఎల్లప్పుడు సీతా, లక్ష్మణులతో కలసి ఉన్న శ్రీరామచంద్రుడు రఘునాధరాజును రక్షించుగాక అని కోరుతున్నాడు. సీత లక్ష్మీదేవి అవతారం కనుక ఆమె ధన, పుత్ర, బుద్ధి, కీర్తి సంపదలు ఇస్తుంది. లక్ష్మణుడు భూమిని మోసే ఆదిశేషువు అవతారం కనుక భూచక్రభరణమునూ, విల్లు ధరించిన రాముడు నాలుగు దిక్కులయందు విజయాలను అందిస్తారు. ఇక్కడ కవి కోదండరాముని గురించి ప్రస్తావిస్తున్నాడు. ఈ కోదండరాముడే సీతాలక్ష్మణులతో కలసి, విల్లు ధరించి, వరదహస్తంతో అన్నివేళలా రఘునాధమహారాజుకు అభయమిస్తాడని భావన.. మామూలుగా రాముడు, శ్రీరాముడు అనకుండా రామమూర్తి (విగ్రహమూర్తిగా ఉన్న రాముడు = కోదండరాముడు) అని వ్యత్యాసం చూపిస్తున్నాడు కవి.

ఉ. శ్రీ కలకంఠకంఠియు, ధరిత్రియు దక్షిణ వామ భాగముల్
గైకొని కొల్వ, వారిఁ గడఁకం గడకన్నుల కాంతిఁ దేల్చి, తా
నా కమలాప్తతం గువలయాప్తతఁ దెల్పెడు రంగభర్త లో
కైక విభుత్వ మిచ్చు దయ నచ్యుత శ్రీ రఘునాధ శౌరికిన్.

రాగం: మోహన ..
రఘునాధరాజు తండ్రీ, కొడుకు కూడా శ్రీరంగంలోని స్వామిని భక్తితో సేవించేవారు. అందుకే ఈ పద్యంలో కవి కుడిప్రక్కన లక్ష్మీదేవి, ఎడమపక్కన భూదేవి అంటిపెట్టుకుని ఉండగా ఇద్దరి పట్లా స్నేహభావాన్ని ప్రకటిస్తూ తన కడగంటి చూపులతో సంతోషపెడుతున్న రంగనాధస్వామి ఈ కృతిపతిని ఏకచ్చత్రాధిపతిగా చేయు గాక.. అని శ్రీరంగనాధుడిని ప్రార్ధిస్తున్నాడు. ఇక్కడ స్వామివారికి ఇద్దరు భార్యలను సంతుష్టపరచడమనే విషయమనే కాక మరో సంగతి మనకు తెలియవస్తున్నది. శ్రీరంగనాధుడు మహావిష్ణువు కనుక సూర్యచంద్రులు అతని రెండు కళ్లుగా ఉన్నారు. సూర్యుడు కమలాలకు, చంద్రుడు కలువలకు ఆప్తులు. రంగనాధుడు కుడి పక్కన లక్ష్మి (కమల), భూదేవి(కువలయ) .. ఇద్దరినీ తన కడగంటి చూపులతో సంతోషపెడుతున్నాడు. దానివలన కుడిపక్కన కమలాప్తత (సూర్యత్వము), ఎడమపక్కన కువలయాప్తత (చంద్రత్వము)యందు స్నేహభావాన్ని ప్రకటిస్తున్న శ్రీరంగనాధుడు అచ్యుతనాయకుని కుమారుడైన రఘునాధుడికి దయతో ఏకచ్చత్రాదిపత్యాన్ని ఇచ్చుగాక అని కోరుకుంటున్నాడు.. ఇక్కడ ఒక చమత్కారం గురించి చెప్పుకోవచ్చు. రంగనాధుడికి ఇద్దరు భార్యలు. ఒకరితో ఉన్నప్పుడు వారిని సంతోషపెట్టడం, మురిపించడం సులభమే. కాని ఇద్దరూ ఒకేసారి తోడున్నప్పుడు ఒకరిని క్రీగంట చూసి మురిపిస్తే ఇంకొకరికి కోపం రావచ్చు. ఇద్దరు భామలను వరించిన ప్రతీ పతికి ఈ సమస్య తప్పదు మరి. ఆ ముప్పునుండి తప్పించుకోవడానికి , ఒకే సమయంలో ఇద్దరినీ సంతోషపెట్టడానికి రెండువైపులా కడకంటి చూపులతో చూస్తున్నాడు. యోగులకు మాత్రమే సాధ్యమైన ప్రక్రియ ఇది.
అలాగే పద్మము, కలువ వికసించడానికి సూర్యకాంతిగాని, చంద్రకాంతి కాని తప్పనిసరిగా అవసరమవుతుంది. లక్ష్మీ భూదేవులని చెప్పుకున్నా కమల, కలువలకు కాంతికి ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. అందుకే కడకన్నుల కాంతి అని ప్రస్తావించాడు కవి..

ఉ. "శ్రీ రుచిరాంగి నీ భవనసీమ ధ్రువంబుగ నిల్చు నేలు దీ
ధారుణి నీవ" యన్న క్రియ దక్షిణపాణి నెఱుంగఁజేయు శృం
గార రసాబ్ధి వేంకటనగ స్థిరవాసుఁడు పూర్ణదృష్టి నెం
తే రఘునాధ భూరమణదేవు గుణంబుల ప్రోవుఁ బ్రోవుతన్
రాగం: కీరవాణి ..
సుందరాంగి ఐన లక్ష్మీదేవి నీ మందిరంలో శాశ్వతముగా నిలిచియుంటుంది. ఈ భూమిని నీవే పాలిస్తావు అంటున్నట్టుగా కుడిచేతితో(వరద హస్తంతో) తెలుపుతున్నట్టుగా శృంగారరసానికి సముద్రం వంటివాడైన వేంకటాద్రిమీద కొలువై ఉన్న వేంకటేశ్వరుడు తన పరిపూర్ణమైన దయతో రాజులకు రాజైన రఘునాదుని సదా రక్షించుగాక అని ప్రార్ధిస్తున్నాడు కవి. కృతిభర్తకు ఇష్టదైవము శ్రీరాముడైనప్పుడు వేంకటేశ్వరుడి ప్రస్తావన ఎందుకొచ్చింది అని సందేహం కలగవచ్చు. కృతిపతి ఇష్టదైవం శ్రీరాముడు, వారి కుటుంబ దైవం శ్రీరంగనాధుడు, బంధువర్గ దైవం వేంకటేశ్వరుడు. అందుకే ఈ ముగ్గురిని ప్రార్ధిస్తూ మొదటి మూడు పద్యాలు రాశాడు కవి. రఘునాధుని మందిరంలో శ్రీమహాలక్ష్మి శాశ్వతంగా నిలిచి ఉంటుంది అని అభయమిచ్చిన వేంకటేశ్వరుడు భార్యను విడిచి ఉండగలడా?? ఆ స్వామి కూడా తన భార్యతో కూడి ఇక్కడే స్ధిరనివాసుడయ్యాడు.

తే. ధీయుతుఁ డటంచు నలువ దీర్ఘాయు వొసఁగి
కాయు రఘునాథ విభు వజ్రకాయుఁ గాఁగ
వీర వరుఁడని హరుఁడ త్యుదార కరుణఁ
జేయు నెప్పుడు విజయు నజేయుఁ గాఁగ.
రాగం: దేశ్ ..
రఘునాధరాజు బుద్ధిజ్ఞానానికి మెచ్చి బ్రహ్మ అతనికి దీర్ఘాయువును, ధృడకాయాన్ని, శివుడు ఓటమి లేని పరాక్రమాన్ని ఇవ్వాలని కవి కోరుకుంటున్నాడు. బ్రహ్మ మనుష్యుల నుదుటి రాతలు రాస్తాడని అందరికి తెలిసిందే. అందుకే అతన్ని దీర్ఘాయువు, వజ్రంవంటి ధృడమైన శరీరాన్ని ఇవ్వమని కోరుతున్నాడు కవి. అదేవిధంగా వీరుడు, విజయుడైన రఘునాధరాజుకు శివుడు మెచ్చి అజేయుడిగా చేయాలని కోరుతున్నాడు. ఇక్కడ విజయ శబ్దం వల్ల మనకు పూర్వం కిరాతార్జునీయంలో అర్జునుని మెచ్చి అజేయుని చేసినట్టే రఘునాధరాజుని చేయమని కోరుతున్నట్టు అవగతమవుతుంది. ఎవరిని ఏమడగాలో, ఏ కారణం చూపి ఏమడగాలో కవి చక్కగా నిరూపించాడని తెలుస్తుంది. అంతేకాక ఈ కృతినాయకుడైన అర్జునుని సుగుణాలు కృతిభర్తయైన రఘునాథరాజుకు అన్వయమవ్వాలని కూడా ఆశంస.

మ. మొగుడుం దమ్ముల విప్పునప్పుడు రజంబున్, జక్రవాళంపుఁ గొం
డ గడిం దేఱుగ డైనపట్ల దమమున్, మందేహులన్ దోలి వా
సి గడల్కొ న్తఱియందు సత్త్వముఁ ప్రకాశింపన్ త్రిమూర్త్యాత్మకుం
డగు తేజోనిధి వేడ్కఁ జేయు రఘునాథాదీశుఁ దేజోనిధిన్.

రాగం: హంసానంది ..
ఇంతవరకు త్రిమూర్తులను వేర్వేరుగా స్తుతించిన కవి ఈ పద్యంలో త్రిమూర్త్యాత్మకుడైన సూర్యుడు రఘునాధరాజును పరాక్రమవంతుడిగా చేయాలని కోరుకుంటున్నాడు. సూర్యుడు చేమకూర కవికి ఇష్టదైవం. తన ఇష్టదేవతను ప్రార్ధిస్తూ తనకోసం కాక కృతిపతి మేలు కోరుతున్నాడు. ఈ పద్యంలో సూర్యుడు ఉదయ సమయాన ముకుళించుకున్న తామరలను వికసింపచేయునప్పుడు పుప్పొడిని తాకినందున రజోగుణముగల బ్రహ్మస్వరూపుడని, చక్రవాళ పర్వతాన్ని చుట్టి పోయే సమయంలో చీకటి వ్యాపించినవేళ తమోగుణ ప్రధానుడైన శివస్వరూపుడని, సంధ్యవేళలో తన గమనాన్ని అడ్డగించే మందేహులనే రాక్షసులను తన పరాక్రమముతో చీల్చి చెండాడి తరిమే వేళ సత్త్వగుణ ప్రధానుడైన విష్ణుస్వరూపుడని చెప్తున్నాడు.. సంధ్యాసమయంలో విడిచే అర్ఘ్యోదకాలు బాణాలై సూర్యునికి సాయపడతాయని ఒక నమ్మకం.. తేజోనిధి(ప్రకాశంలో)యైన సూర్యుడు రఘునాధమహారాజును కూడా తేజోనిధి(పరాక్రమంలో)ని చేయమని కోరుతున్నాడు కవి.

శా. మాద్యద్దంతి ముఖార్చనా నియమముం బాటించు నెల్లప్పుడున్
సద్యఃపూర్ణ ఫలాప్తిచే మనుచు నంతర్వాణులన్ మామనో
హృద్యుం డౌ రఘునాధశౌరి, యని కూర్మిన్ సాటికిన్ బోటికిన్
విద్యాబుద్ధు లొసంగి ప్రోతు రతనిన్ విఘ్నేశుఁడున్, వాణియున్.


రాగం: నీలాంబరి ..
లక్ష్మీదేవి మనసుకు సంతోషం కలిగించేవాడైన, విష్ణువాంశతో జన్మించిన రఘునాధుడు మదించిన ఏనుగు అనగా పట్టపుటేనుగు యొక్క ముఖాన్ని నిత్యం పూజించే నియమము కలిగినవాడు. ఇలా చేయడం వల్ల తనకే పూజ చేస్తున్నాడని ఆ విఘ్నేశ్వరుడు సంతృప్తి చేందుతాడు. రేపురా , మాపురా అని ఆలస్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా విద్యావంతులు, పండితులు పూర్తిగా సంతృప్తి చెందునట్టుగా బహుమానములు ఇచ్చి పోషించుటవలన తనను తృప్తి పరుస్తున్నాడని సరస్వతీదేవి సంతోషిస్తుంది. అందువలన సరస్వతి, వినాయకులు ఒకరిని మించి మరొకరు రఘునాధునికి విద్యాబుద్ధులనిచ్చి రక్షించాలని కవి ప్రార్ధిస్తున్నాడు.

శా. ప్రాగల్భ్యంబున విష్ణు శంభు మతముల్ పాటించి, సర్వంసహా
భాగంబందు సమప్రధాన గతి యొప్పన్ రాజలోకంబులోఁ
దా గణ్యుం డని యచ్యుతేంద్ర రఘునాథ క్షోణిభృన్మౌళికిన్
శ్రీ గౌరుల్ సమకూర్తు రాహవజయశ్రీ గౌరులన్ నిత్యమున్


రాగం: నాట ..
సాధారణంగా రాజులందరూ శైవ, వైష్ణవ మతాలలో ఒక్కదానికి చెందినవారు అయి ఉంటారు. అందుకే స్వమతానికే ప్రాదాన్యతనిచ్చి ఇతర మతాలను అణగదొక్కాలని ప్రయత్నిస్తుంటారు. కాని వైష్ణవ, శైవమతములు రెంటినీ సమానంగా గౌరవించి తన రాజ్యంలో సమానమైన ప్రాధాన్యతనిచ్చుటవలన అందరి రాజులలో ఈ రఘునాధుడు అగ్రగణ్యుడని అచ్యుతరాజు కుమారుడైన రఘునాధ రాజశ్రేష్ఠునికి ఆ విష్ణువు భార్య లక్ష్మీదేవి విజయాన్ని, శివుని భార్య గౌరిదేవి రాజ్యసంపదను ఇస్తారని భావము. రఘునాధుడు, అతని తాత చెవ్వప్ప, తండ్రి అచ్యుతుడు అందరునూ వైష్ణవ భక్తులైనా కూడా ఇరుమతాల దేవాలయాలకు గోపురాలు, ఆభరణాలు మొదలైనవి ఇచ్చేవారు. అంతేకాదు అప్పుడే మన దేశంలోకి ప్రవేశిస్తున్న బుడుతకీచులు (పోర్చుగీసులు) మొదలైన క్రిస్టియన్ మతస్ధులను కూడా గౌరవించేవారు. తమ భర్తల మతములను పక్షపాతం లేకుండా గౌరవిస్తూ, ఆధరించేవాడని శ్రీ, గౌరిలిద్దరూ రఘునాధరాజును అనుగ్రహించి వరాలిస్తారని కవి అభిప్రాయము.

మ. ప్రకట శ్రీహరి యంఘ్రిఁ బుట్టి, హరు మూర్ధం బెక్కి యాపాద మ
స్తకమున్ వర్ణన కెక్కు దేవి సహజోదంచ త్కులోత్పన్న నా
యక రత్నంబని యచ్యుతేంద్ర రఘునాథాధీశ్వర స్వామికిన్
సకలైశ్వర్యములు న్నిజేశు వలనన్ దాఁ గల్గగాఁ జేయుతన్..


రాగం: శ్యామ ..
శ్రీమహావిష్ణువు పాదముచెంత పుట్టి శివుని తలమీద కూర్చున్న గంగాదేవిపై ఆ హరునికి మక్కువ కాస్త ఎక్కువేనని , అందుకే ఆమె తలుచుకున్నవెంటనే తన భర్తతో ఎటువంటి పనైనా చేయించగలదని అర్ధము. హరిపాదముల చెంత ఉద్భవించుటచే శూద్రకులానికి చెందినదై తన కులము వాడైన రఘునాథమహారాజుకు శివుని ప్రాభవముతో సకలైశ్వర్యములు గంగాదేవి ఇవ్వగలదని కవి కోరుకుంటున్నాడు. విష్ణుపదమంటే ఆకాశం. అలనాడు వామనావతారంలో విష్ణువు ఆకాశన్నంతటిని ఒక పాదంతో ఆక్రమించాడు కదా. అక్కడ పుట్టినది కావున ఆకాశగంగ అయినది. గంగను భూమిమీదకు దించడానికి జరిగిన భగీరధ ప్రయత్నం వల్ల శివుడు ఆమెను తన తలమీదకు ఎక్కించుకున్నాడు. అమితమైన ప్రేమకలిగిన భర్త భార్యను నెత్తిమీద కెక్కించుకున్నాడంటారు. అందుకే ఆమె తనకిష్టమైన పనిని శివునితో చేయించగలదట. అంతే కాదు గంగ విష్ణుపాదమునందు పుట్టింది. శూద్రులు బ్రహ్మపాదమునుండి పుట్టారని ప్రతీతి. అందుకే పాదమునందు పుట్టుటచేత గంగ, శూద్రులకు సహజాత అంటున్నాడు కవి. తన కులానికి చెందిన రఘునాధమహారాజుపై గల బంధుప్రీతితో శివునితో కోరి ఐశ్వర్యములు ఇప్పించగలదని కవి చమత్కరిస్తున్నడు. మగవాళ్లతో పని చేయించుకోవాలంటే వాళ్ల భార్యలతో రికమెండ్ చేయించడం తెలీనిదెవరికి??
ఈ ప్రార్ధనలలో కవి సకల దేవతలను స్తుతించాడు. కృతిపతికి అతని కుటుంబ, వంశస్ధులకు ఇష్టులైన రాముడు, రంగనాధుడు, వేంకటేశ్వరుడు, తనకిష్టుడైన సూర్యుడిని, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సరస్వతీ వినాయకులు, శ్రీ, గౌరిలు, గంగ లను తనకొరకు ఒక్క కాసంతైనా అడగకుండా రఘునాధమహారాజు కొరకే ప్రార్ధించాడు.