Pages

Subscribe:

Friday, November 16, 2012

ప్రధమాశ్వాసం - పుర, ప్రజావర్ణనవిజయవిలాసం కావ్యంలో ఇష్టదేవతా స్తుతి, కృతిపతి గుణప్రస్తుతి, కృతి సమర్పణ సన్నాహాల తర్వాత కధలోకి ప్రవేశిద్దాం.. ఈ టపా నుండి మనం విజయవిలాసం అసలు కధలోకి  వెళుతున్నాము. ముందుగా అందమైన ఇంద్రప్రస్త నగర వర్ణన:
ఈ టపాలోని  పద్యాలన్నీ పాడినవారు రాఘవ…


 శా. చంద్రప్రస్తర సౌధ ఖేలన పర శ్యామా కుచద్వంద్వ ని
స్తంద్ర ప్రత్యహ లిప్త గంధ కలనా సంతోషిత ద్యోధునీ
సాంద్ర ప్రస్ఫుట హాటకాంబురుహ చంచచ్చంచరీకోత్కరం
బింద్రప్రస్థపురంబు భాసిలు రమాహేలాకళావాసమై.


 
ఇంద్రప్రస్థపురము లక్ష్మీదేవి విలాసానికి వాసమై భాసిలుతున్నది.  ఎట్లనగా, సౌధములలో ఆటలాడు పడతుల కుచములకు పూయబడిన గంధము ఆకాశగంగకు తెలియుచున్నది, సంతోషింపజేయుచున్నది.  అంతటి ఎత్తుగల మేడలు. ఆకాశగంగలోని బంగారుతామరల చుట్టూమూగిన తుమ్మెదల సమూహములు కల ఆ మేడలు లక్ష్మీదేవికి ఆలవాలమై శోభించుచున్నవి.

సీ. తడఁబాటు గలదు వేదముల నాతని కంచుఁ బరమేష్ఠి మెచ్చరు ధరణిసురులు
కడమాటు పగవానిఁ గని చే మఱచె నంచు భార్గవు మెచ్చరు బాహుజనులు
పనికి రా కొకమూలఁ బడియె నాతనివస్తులని కుబేరుని మెచ్చ రర్యజనులు
వీటిపా  టైన నాఁగేటిపాటున మించునని  హలాయుధు మెచ్చ రంఘ్రిభవులు

తే. పాడిఁ దప్పక ధర్మంబు పట్టువిడక
లక్షలకు నమ్మఁ జాలి నల్గడల భూమి
వరులు మే లనఁ దని యిట్లు పురిఁ బొలుతురు
చదువుసాముల ధనధాన్యసంపదలను.


ఆ నగరిలోని నాలుగువర్ణముల వారూ ఎవరికీ తీసిపోరు. బ్రాహ్మణులు బ్రహ్మయొక వేదోచ్ఛారణలోనే తప్పులు పట్టగలరు. ఇఱువదొక మార్లు క్షత్రియవంశములను నాశనము చేసిన పరశురాముఁడు తుదకు శ్రీరాముని చేత పరాభవింపబడెనని ఎంచి ఆ నగరి క్షత్రియులు భార్గవుని సైతము మెచ్చరు. వైశ్యులు తమ సంపదలను వాడుకొనుటలో కడు నేర్పరులు, ఆ విషయములో వారు కుబేరుని కూడ మెచ్చరు. ఆతని వస్తు సముదాయము నిష్ప్రయోజనముగ మూలబడి యుండునని వారి భావము. శూద్రులు తమ నాగళ్ళు బలరాముని నాగళ్ళను మించునను భావము గల వారు. ఈ విధముగా న్యాయధర్మాలు తప్పకుండా ఆ పురవాసులు వైభవముతో నివసించుచున్నారు.

ఉ. రే లమృతాంశులో శశము రెమ్ముద మంచుఁ దలంచి జాళువా
మేలి పసిండి సోయగఁపు మేడల గుజ్జెనగూళ్ల సందడిన్
బాలిక లుండి యావలఁ జనం గని చింతిలి "వంటయింటి కుం
దే లిది యెందుఁ బోఁగలదు నేఁటికి నే"మని యందురందులన్.


ఆ పురములోని బాలికలు చంద్రునిలోని కుందేటిని పట్టిలాగ తలంచి ఆటలో మునిగియుండ నంతలోనే చంద్రుడు యావల బోవుటవలన చింతించి మరల వారిలో వారు సమాధానపడుచున్నారు. వంటింటి కుందేలు ఎక్కడకు బోవును మరల రాకమానదు కదా యని. చంద్రునిలో కుందేటిని వంటింటి కుందేలని లోకోక్తిలో ఇమడ్చడ మీ పద్యములోని చమత్కారము.


ఉ. వేడుక నప్పురీహరుల వేగముఁ గన్గొని లేళ్లు "గాడ్పుతోఁ
గూడి చన న్వలెన్ మనము గూడఁగ నోపక యోడినట్టివా
రోడనివారి మోచు" టని యొద్దికఁ బందెము వైచి కూడ లే
కోడెనొ కాక మోయఁగఁ బ్రయోజన మే మనిలుం గురంగముల్.

ఇంద్రప్రస్థములోని గుఱ్ఱములు వాయువేగము గలవి.  ఆ గుఱ్ఱముల వేగము జూచి గాలితో గూడి పరుగిడవలెనని, లేనిచో ఆ హరులను ఓడింపలేమని తలచి, తుదకు ఓడిపోయి ఆటకై వేసిన పందెమువలన గాలికి వాహనములైనవి లేళ్ళు. గాలికి లేళ్ళు వాహనములెందుకో చమత్కరించి తెలుపుచున్నాడు చేమకూరకవి.


సీ. ఆరామసీమలయందు నుండి పవళ్లు ముదమొసంగ వసంతుఁ డెదురుచూచు
మునిమాపుకడలఁ గ్రొన్ననవింటినెఱజోదు కేళిమందిరముల కెలనఁ జూచుఁ
బ్రొద్దు వోయినవేళ రోహిణీప్రాణేశుఁ డుదిరిమేఁడల మీఁద వెదకి చూచుఁ
 దెలతెలవాఱంగ మలయగంధవహుండు సోరణగండ్లలోఁ జొచ్చి చూచు
తే. నా పురి విలాసవతుల యొయ్యారములకుఁ
గడు సొగసి వారి రాకలు కాచి కాచి
విరహులఁ గలంచువారె యివ్విధము గాఁగ
నున్నవారల నిఁక వేఱె యెన్న నేల.

ఆ పురి విలాసవతులు విరహులను కలచువారైన వసంత, మన్మథ, చంద్ర, మలయమారుతములనే కలచి వేయ గలవారు. పగటిపూట వసంతుఁడు ఉద్యానవనములలో వారి కొఱకు ఎదురు చూచుచుండును. ప్రొద్దు క్రుంకిన వేళ మన్మథుఁడు వారి పడకింటి వైపు ఓరచూపుల చూచుచుండును. రాత్రివేళల వారికై చంద్రుఁడు మేడల వెతుకుచుండును. తెలతెలవారుచుండగా నిదురించుచున్న వారిని కిటికీలలో ప్రవేశించి పవనుఁడు చూచుచుండును. ఈ విధముగా విరహులను బాధపెట్టుటలో ప్రఖ్యాతిగాంచిన ఆ నలువురినీ బాధపెట్టగల వారు ఆ నగరిలోని ఆటవెలదులు.


   చ. పొలయలుకల్ వహించి వలపుల్ మొలిపించు పిసాళిగబ్బి గు
    బ్బల జవరాండ్రమై గగురుపాటున నేటికి వచ్చెనమ్మ తాఁ
    బిలువని పేరఁటం బనుచు బెగ్గిలి నాథులఁ గౌఁగిలింపఁ గాఁ
    బొలుపుగ నందుఁ బెండ్లినడుపుల్ నడపున్ వలినాలితెమ్మెరల్.


ఆ పురములో పిలువని పేరంటమునకు వచ్చినట్లుగా వచ్చి పెళ్లికార్యాలను నడిపిస్తాయి తెమ్మెరలు.  అది ఎలాగునో చూడగా,  చల్లని తెమ్మెరల తాకిడికి తమకు తామై జవరాళ్ళు నాథుల కౌగిళ్లలో ఒదిగిపోతున్నారు, అది తమ ప్రవృత్తికి భిన్నమైన పని అయిననూ అనుకోకుండా వచ్చిన తెమ్మెర వలన కలిగిన గగురుపాటు వారితో ఆ పని చేయిస్తున్నది, చేయినది లేక గాలిని మాట లని ప్రియులకౌగిళ్లలో చేరుతున్నారు కాంతలు.


    తే. పోఁకమ్రాఁకుల మహిమ కప్పురపుటనఁటి
    యాకుఁదోఁటల సౌభాగ్య మందె కలదు
    ప్రబలు మౌక్తిసౌధసంపదల మహిమ
    వీటి రహి మెచ్చవలయుఁబో వేయునోళ్ల.

వీటి రహి మెచ్చవలయుఁబో వేయినోళ్ల అనునది  ఈ పద్యములో చమత్కారము. వేసుకొన్న నోటనే విడెము (కిళ్లీ) యొక్క రుచి మెచ్చుకోలు వస్తుందనునది ఒక అర్థము, పైన ఆకుతోటల ప్రస్తావన ఉన్నది కాబట్టి ఇది అతుకుతుంది. ఇంద్రప్రస్థములో పోకచెట్ల, కర్పూరపు అరటి తోటల సౌభాగ్యము, ముత్యాలతో అలంకరింపబడిన సౌధముల గరిమ వీటిని మెచ్చడానికి ఒక నోరు చాలదట, వేయినోళ్లు కావలెనట. ఇది మఱియొక అర్థము.


    ఉ. ఆణిమెఱుంగు ముత్తెపుటొయారపుమ్రుగ్గులు రత్నదీపికా
    శ్రేణులు ధూపవాసనలు హృద్యనిరంతరవాద్యఘోషముల్
    రాణఁ బొసంగఁ బ్రోలు మిగులం గనువిం దొనరించు నిత్యక
    ల్యాణముఁ బచ్చతోరణము నై జను లందఱు నుల్లసిల్లగన్.ముత్యాలముగ్గులతో, రత్నదీపావళులతో, ధూపవాసనలతో, నిరంతర వాద్యఘోషలతో, ఆ పట్టణపు జనులు నిత్యకల్యాణము, పచ్చతోరణముగా సంతోషములలో మునిగితేలుచుందురు.

0 వ్యాఖ్యలు:

Post a Comment