Pages

Subscribe:

Monday, September 17, 2012

కృతిపతి గుణగణములు
ఈ టపాలోని పద్యాలను పాడింది నారాయణస్వామిగారు..

ఇష్టదేవతా స్తుతి తర్వాత కవి కృతిపతి వంశంలోని వారిని గురించి ప్రస్తావించాడు.. . అటు పిమ్మట విజయవిలాసము కృతిపతి రఘునాధరాజుని పరిచయం చేస్తూ అతని గుణగణాలు, పరాక్రమం మొదలైనవి వివరిస్తున్నాడు.

ఉ. పుట్టిన దాదిగాఁ దనదు పుణ్యమె దాదిగ, వైరిభూమి భృ

ద్ధట్ట మదంబు దా దిగ, సదా దిగధీశ నుత ప్రతాపుఁ డై

పట్టమహాభిషేక బహుభాగ్య ధురంధరుఁడై యయోధ్య య

న్పట్టణ మేలు సామియొ యనన్ రఘునాథ విభుండు వర్ధిలున్

రఘునాధరాజు పుట్టినప్పటినుండి చేసిన పుణ్యఫలమే అతన్ని కాపాడుతూ వస్తుంది. అతను తన పరాక్రమముతో శత్రురాజుల గర్వమణచి, నాలుగు దిక్కులయందు ఉన్న రాజుల ప్రశంసలు పొందాడు అని కవి వివరిస్తున్నాడు. ఈ ప్రశంసలో కవి రఘునాధరాజును, శ్రీరామచంద్రునితో పోలుస్తున్నాడు. రఘునాధరాజు పూర్వీకుడైన చెవ్వప్ప నాయకుడు, తండ్రి అచ్యుత నాయకుడు తంజావూరును సామంతరాజులుగానే పాలించారు కాని రఘునాధ మహారాజు మాత్రం తన పరాక్రమంతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని విజయుడై చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకుని తంజావూరును పాలించాడు. అదే విధంగా శ్రీరాముడు కూడా చిన్నప్పటినుండి ఎన్నో కష్టాలను దాటుకుని అయోధ్యకు పట్టాభిషిక్తుడై జనరంజకంగా పాలిస్తూ ఇంద్రాది దిక్పాలకుల ప్రశంసలను పొందినట్టు రఘునాధుడు నాలుగు దిక్కుల యందు ఉన్న రాజుల ప్రశంసలను పొందాడు అని కవి భావం..

ఉ. శైలము లెక్కి, యష్ట మదసామజ మౌళుల మీఁదుగా, మహా

కోల కులేంద్రు వాడి బలు కొమ్ము మొనంబడి, సర్వదా విష

జ్వాలలు గ్రమ్ము శేషు తల చాయనె యోడక వచ్చి కూడె నౌ;

భూ లలితాంగి కెంత వలపో రఘునాథ నృపాలమౌళిపై?

ప్రేమించిన ప్రియురాలి కోసం ప్రియుడు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాడు, పోరాడతాడు. ఆమెకు దక్కించుకుంటాడు. అదే విధంగా వలచిన వనిత కూడా అడ్డంకులన్నీ దాటుకుని ప్రియవిభుని చెంతకు చేరుతుంది. అదే విధంగా ఇక్కడ భూదేవి అనే కాంత కొండలన్నీ ఎక్కి, మదగజముల తలల మీదుగా ప్రయాణించి, ఆదివరాహం వాడియైన కోరమీద పడి కూడా లక్ష్యపెట్టకుండా, నాగరాజు విషజ్వాలలను కూడా తప్పించుకుని వచ్చి రఘునాధమహారాజును చేరుకుందంట.

భూమిని పర్వతాలు, అష్టదిగ్గజాలు,ఆదిశేషుడు భరిస్తూ ఉంటారని ప్రసిద్ధి.. మూడవ అవతారంలో విష్ణువు వరహాముగా (మహాకోలకులేంద్రుడు) ప్రళయ సముద్రంలో మునిగిపోయిన భూమిని తన వాడికోరలు గల ముట్టెతో ఎత్తినాడు. రఘునాధ మహారాజును చేరడానికి భూదేవి వాటినన్నింటిని కాదనుకుని కొండలను దాటి, ప్రమాదకరమైన మత్తగజముల తలలమీదుగా నడిచి, విషజ్వాలలు కక్కుతున్న ఆదిశేషుడిని తప్పుకుని, శరీరాన్ని చీల్చివేయ గలిగేటంత వాడిగా ఉన్న ఆదివరాహం కోర గుచ్చుకున్నా లెక్క చేయకుండా వచ్చింది. వీటన్నిటికంటే శ్రేష్టుడు రఘునాధమహారాజు అని కవి భావిస్తున్నాడు.

సీ. రత్నాకరాం తోర్వరా విహారుం డౌట

నగ్రహారము లసంఖ్యముగఁ జేసె;

నమిత దానవినోది యగుటఁ గక్ష్యాంతర

భద్రకుంభీక్షణ పరతఁ దనరె;

దక్షిణ నాయకోత్తముఁ డౌట మేలైన

మలయజగంధి మండలము నేలె;

భరత విద్యా ధురంధరుఁ డౌట రంగస్థ

లంబు రామాలంకృతంబు చేసె;

తే. నౌర! కర్ణాట సింహాస నాధి రాజ్య

భరణ నిపుణ రణోద్దండ బాహుదండ

జనిత సాపత్న్య సంవాద జయరమా మ

హీలలిత కేళి రఘునాథ నృపతిమౌళి


ఈ పద్యంలో కవి రఘునాధమహారాజు కళాప్రియుడిగా చేసిన పనులూ, మహారాజుగా చేసిన పనులను సమంగా వర్ణిస్తున్నాడు. రత్నాలకు నిలయమైన రాజ్యాన్ని పాలించడం వల్ల ఎన్నో విలువైన రత్నహారములను ధరించేవాడు (బ్రాహ్మణ అగ్రహారములను నిర్మించాడు) హద్దులు లేని దానములు అమితంగా చేయడానికి సంతోషించేవాడు కావడంతో కోటలో భద్రగజములను చేర్చుకుని ఆసక్తిగా చూసేవాడు.(మంగళప్రదమైన పూర్ణకుంభముల ఉత్సవాలను ఆసక్తిగా చూసేవాడు).దక్షిణదేశపు నాయక రాజులలో ఉత్తముడు, సమర్ధుడైన గొప్ప నాయకుడు (అనేకమంది భార్యలను సమానంగా సంతోషపెట్టేవాడు) కావడం వల్ల చందనగంధులవంటి స్త్రీల సమూహాన్ని (చందనపు వృక్షాలు అధికంగా కలిగిన మలయ పర్వతాలు ఉన్న దక్షిణదేశాన్ని) పాలించినవాడు. నాట్యశాస్త్రమందు ప్రావీణ్యం కలిగి రంగస్థలాన్ని స్త్రీలతో అలంకరించాడు (భరతునివలె వివేకము కలిగినవాడై శ్రీరంగక్షేత్రంలో శ్రీరామ విగ్రహంతో అలంకరించాడు)... రఘునాధుడు శ్రేష్టుడై కర్ణాట రాజ్యాన్ని విస్తరించి కాపాడడానికి తన పరాక్రమముతో పలు యుద్ధాలలో పాల్గొని విజయాన్ని సాధించేవాడు. దానివలన రాజ్యలక్ష్మి (భూదేవి), జయలక్ష్మి (విజయలక్ష్మి) మధ్య ఏర్పడిన సవతిపోరును వినోదంగా చూసేవాడు.

ఈ పద్యంలో కవి ఒక విచిత్రమైన పద్ధతిని అనుసరించాడు. పెద్ద పాదములో మొదటి దళంలో కారణము, రెండవ దళంలో కార్యమును చెప్పాడు. ఒక్కొక్క దళానికి రెండేసి అర్ధాలు సూచించాడు. ఇందులో రఘునాధమహారాజుకు వ్యక్తిగతంగా ఉన్న ప్రియమైన కార్యాలు - రత్నహారాల ప్రీతి, గజముఖ వీక్షణ, విదుషీమణుల ఆదరణ, నాట్యమందున్న అభిరుచి .... మహారాజుగా అతని కార్యాలు బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇవ్వడం, దానాలు చేయడం, సమర్ధవంతమైన పాలన, దేవలయాల ఉద్ధరణ .. ఈ విషయాలను సమన్వయ పరుస్తూ చమత్కారంగా కవి పేర్కొన్నాడు.

శా. రాజున్ భోగియు సౌమ్యుఁడున్ గవియు సర్వజ్ఞుండు నీ డౌననన్

దేజః ప్రౌఢవచో వివేక నయ భూతి శ్లాఘలన్ మించు; నౌ

రాజున్ భోగియు సౌమ్యుఁడున్ గవియు సర్వజ్ఞుండు నెబ్భంగులన్

యోజింపన్ రఘునాథ భూరమణవర్యుండే ధరామండలిన్.

ఈ పద్యంలో రాజుయొక్క పది మంచి గుణాలను ప్రస్తావించాడు కవి. రఘునాధుడు చంద్రునివంటి కాంతిని, ఆదిశేషుడి(భోగి - భోగం అనగా పడగ.. కలవాడు శేషుడు)వంటి మాటకారితనము, బుధునివంటి వివేకమును, శుక్రుని వంటి నీతి, శీవుని వంటి ఐశ్వర్యమును కలిగినవాడు. అంతే కాకుండా చక్కని పరిపాలన, భోగములు అనుభవించుట, సమరస భావము , కవి, సకల విద్యలు ఎరిగినవాడై అపారమైన జ్ణానము కలిగనివాడని భావము. ఉపమానాలుగా చెప్పిన రాజు, భోగి, బుధుడు, కవి, సర్వజ్ఞుడు మొదలైనవి సుప్రసిద్ధులైన వ్యక్తుల గురించి తెలుపుతాయి. చంద్రుడు మొదలైన అయిదుగురూ ఒక్కొక్కరూ ఒక్కొక్క విశిష్ట గుణానికి ప్రసిద్ధులు. కాని కవి భావనలో ఈ ప్రపంచంలో రఘునాధుడు ఈ ఐదుగుణాలు కలిగినవాడు.. అతని వంటివాడు మరి వేరే లేరు.


సీ. అరిది సింగపుఁబల్ల మమరించె నేరాజు

మేలుఁ దేజికిఁ బదివేలు సేయఁ

జికిలి బంగరు దిండ్ల పికిలి కుచ్చుల యంద

లం బెక్కె నేరాజు లక్ష సేయఁ,

గనక మయంబుగాఁ గట్టించె నేరాజు

సాటిలేని నగళ్ళు కోటి సేయఁ

గంఠమాలిక మొదల్ గాఁ బెట్టె నేరాజు

గొప్ప సొమ్ములు పదికోట్లు సేయ

తే. నతఁడు ప్రభుమాత్రుఁడే! బహుళాగ్రహార

నిత్య సత్త్ర మహాదాన నిరతపోషి

తాహిమాచల సేతు ద్విజాభిగీర్ణ

పుణ్యవిభవుండు రఘునాథ భూవిభుండు


రఘునాధమహారాజు విలాసవంతంగా జీవించాడు... ఎంతో విలువైన వస్తువులు, అలంకరణలతో మందిరాలు, ఆభరణాలు నిర్మించాడు. అంతే కాక అతను బ్రాహ్మణులకోసం ఎన్నో అగ్రహారాలు, నిత్యాన్న సత్రాలు నిర్మించి, మహాదానాలు చేసి వారిని సంతుష్టపరిచాడు.. ఏ రాజు తన శ్రేష్టమైన గుర్రానికి పదివేల వరహాలతో అపురూపమైన సింహపు ముఖము గల జీనును చేయించాడో. లక్షవరహాల ఖరీదు చేసే బంగారు నగిషీ పనితో తయారు చేసిన అందమైన తలగడ దిండ్లతో, పికిలి పిట్టలతో చేసిన కుచ్చులుగల పల్లకీ ఎక్కాడో. కోటి వరహాల విలువ చేసే బంగారుతో చేయబడిన అలంకరణలతో ఎన్నో సాటిలేని మేడలు కట్టించాడో. పది కోట్ల వరకు విలువ చేసే కంఠహారం మొదలైన నగలెన్నో ధరించాడో. ఆ ప్రభువే ప్రజలు, బ్రాహ్మణుల కోసం ఎన్నో అగ్రహారాలు, నిత్యాన్న సత్రాలు కట్టించి, గొప్ప గొప్ప దానాలు చేసి బ్రాహ్మణులచేత కొనియాడబడ్డాడు.

సీ. అడుగు మాత్రమె కాక యంత కెక్కుడుగ నీఁ

జాలెనే యల బలిచక్రవర్తి?

యా వేళ కటు దోఁచినంత మాత్రమె కాక

కోర్కి కెచ్చిచ్చెనే యర్కసూతి?

తూఁగిన మాత్ర మిత్తుననెఁగా కిచ్చవ

చ్చినది కొమ్మనియెనే శిబి విభుండు?

కలమాత్ర మపు డిచ్చెఁ గాక కట్టడ గాఁగ

ననిశంబు నిచ్చెనే యమృతకరుఁడు?

తే. వారి నే రీతిఁ బ్రతి సేయవచ్చు నెల్ల

యర్థులఁ గృతార్థుల నొనర్చునట్టి యప్ర

తీప వితరణికి, మహా ప్రతాప తిగ్మ

ఘృణికి, నచ్యుత రఘునాథ నృపతి మణికి?

బలిచక్రవర్తి వామనుడు అడిగిన మూడు అడుగుల స్థలాన్ని మాత్రమే ఇచ్చాడు. అంతకంటె ఎక్కువగా ఇవ్వలేదు. సూర్యపుత్రుడైన కర్ణుడు బ్రాహ్మణ వేషంలో వచ్చిన ఇంద్రుడికి అతను అడిగిన కవచ కుండలాలు మాత్రమే ఇచ్చాడు కాని అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. శరణు కోరి వచ్చిన పావురానికి శిబి చక్రవర్తి దాని బరువుకు సమానమైన తన శరీర మాంసం డేగకు ఇస్తానన్నాడే గాని ఇష్టము వచ్చినంత తీసుకోమని అనగలిగాడా? తన కిరణాలలో అమృతాన్ని కలిగిన చంద్రుడు తనకున్న పదహారు కళలలో ఒక్క కళను మాత్రమే ఏరోజు కారోజు నిశివేళలోనే వెలుగునిచ్చాడు కాని ఎల్లప్పుడు ఇవ్వగలిగాడా? రఘునాధ మహారాజు మాత్రం అన్ని వేళలా యాచించివారందిరినీ సంతోషపరిచే నిరతాన్న దాత. మహాప్రతాపవంతుడు. వేడి వెలుగులనిచ్చే సూర్యుడితో సమానుడైన రఘునాధశ్రేష్టుడిని ఈ బలి, కర్ణ, శిబి, చంద్రులతో ఏ విధంగా సరిపోల్చగలము..

సీ. ఆకారమున నలునంతవాఁ డౌనెకా

హయసమ్యగారూఢి నంతవాఁడె!

యతి దయామతి రామునంతవాఁ డౌనెకా

యసమాన గురుభక్తి నంతవాఁడె!

యమృషోక్తి ధర్మజునంతవాఁ డౌనెకా

యన్నసత్త్ర ఖ్యాతి నంతవాఁడె!

యాలంబునఁ గిరీటియంతవాఁ డౌనెకా

యమిత నాట్య ప్రౌఢి నంతవాఁడె!

తే. రసికమాత్రుండె యంతఃపుర ప్రవీణ

సారసా క్ష్యధర సుధారస లస దాశు

కవన శతముఖ బహుకలా కలన హృష్ట

బుధజ నాస్ధాని రఘునాథ భూమిజాని?

ఈ రఘునాధుడు రూపంలో నలునితో సమానమైనవాడే కాక గుర్రపు స్వారీలో కూడా నలుడికి ధీటైనవాడే.. మిక్కిలి దయతో నిండిన మనసు కలిగి ఉండడంలో రామునియంతటివాడే కాక అసమానమైన పితృభక్తిలో కూడా ఆ రాముని అంతటివాడే.. సత్యము పల్కుటలో ధర్మరాజంతటివాడేకాక ఆర్తులకు భోజన సత్రాలను నిర్మించి కీర్తిపొందుటలో కూడా అంతటివాడే. యుద్ధపరాక్రమంలో అర్జునుడివంటివాడే కాక అతని వలెనే నాట్యశాస్త్రంలో నేర్పరి..

రఘునాధమహారాజు అంతఃపురంలోని కవయిత్రులు ఆశువుగా చెప్పే కవితల మాధుర్యానికి ఆ వనితల పెదవులయందలి అమృతరసం మరింత తీయదనాన్ని కలిగిస్తుందనీ, రఘునాధుని సభలోనున్న పండితులు అనేక విద్యలలో పారంగతులైనా కూడా ఆ వనితలవలె మధురమైన కవిత్వం చెప్పలేమని సిగ్గుతో తల వంచుకున్నారంట. రఘునాధ మహారాజు అసాధారణ ప్రతిభ కలిగిన కాంతలను అంతఃపురంలో, అనేక విద్యలలో ఆరితేరిన పండితులను ఆస్థానంలో ఉంచుకుని ఆదరించేవాడని తెలుస్తుంది.

ఉ. తా రసపుష్టిమైఁ బ్రతిపదంబున జాతియు వార్తయున్ జమ

త్కారము నర్థ గౌరవముఁ గల్గ ననేక కృతుల్ ప్రసన్న గం

భీరగతిన్ రచించి మహి మించినచో నిఁక శక్తు లెవ్వ ర

య్యా! రఘునాథభూప రసికాగ్రణికిన్ జెవిసోఁకఁ జెప్పఁగన్?

తనకు రఘునాధరాజు చూపిన ఆదర, సత్కారాలకు కృతజ్ఞతగా తన రచనను అంకితమివ్వాలని చేమకూర కవి సంకల్పించాడు. శృంగారాది రసములు, ప్రతీ పదంలో విశేషమైన స్వభావ వర్ణనలు, కథను నడిపించే నేర్పు, చమత్కారములు, అర్ధపుష్టి కలుగునట్లు, అందరికీ సులభముగా అర్ధమయ్యే విధంగా, విశేష అర్ధము కలిగిన కావ్యాలెన్నో స్వయంగా రచించి ఆంధ్రదేశంలో కీర్తిని సంపాదించిన రఘునాధభూపతికి నచ్చిన విధంగా చెప్పి , మెప్పింపగల సమర్ధులు ఎవరైనా గలరా? సంస్కృతాంధ్రములలో అనేక గ్రంధాలను వ్రాసిన రఘునాధరాజును తన కవిత్వంతో మెప్పించగలనా అని చేమకూర కవి సందేహిస్తున్నాడు.

మ. కలిగెంగా తన సమ్ముఖం బనియు, సత్కారంబు తాఁ జేయ నా

తల నెందే శిరసా వహింతు రనియుం, దాఁగాక లేదెందు సా

ధులకుం దిక్కనియుం, దయన్ మనుపు రీతుల్గాక శక్యంబె వి

ద్యల మెప్పింపఁగ నచ్యుతేంద్ర రఘునాథస్వామి నెవ్వారికిన్?

రఘునాధ మహారాజు గొప్ప విద్వాంసుడు. అతనికి తెలియని విద్య లేదు. అంతటివాడిని తమ విద్యలతో మెప్పింపడం ఎవ్వరికీ తరం కాదు. ఆ రాజు తన దగ్గరకు వచ్చిన కవులు , పండితులు ఊరకే పోరాదని, తాను గౌరవించినచో మిగతావారు కూడా తప్పకుండా గౌరవిస్తారని, వారికి పండిత ప్రభువైన తానుగాక వేరెవ్వరు ఆశ్రయం ఇవ్వగలరు అనుకొని ఆ రాజు కవులను, పండితులను పోషించాలి, ఆదరించాలి కాని కేవలం తమ పాండిత్యం చేత అతనిని మెప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు.

0 వ్యాఖ్యలు:

Post a Comment