కవి ఈ కథలో ఇంద్రప్రస్తపురాన్ని,
ఆ తర్వాత
భటులు, గుర్రాలు, మేడలు, పుష్పలావికలు, వేశ్యలు, విటులు మొదలైన వారిని వర్ణిస్తూ ఆ రాజ్యానికి మహారాజైన ధర్మరాజును
గురించిన ప్రత్యేకతలను ఇలా వివరిస్తున్నాడు.
ఈ టపాలోని పద్యాలన్నీ పాడినవారు రాఘవ
ఈ టపాలోని పద్యాలన్నీ పాడినవారు రాఘవ
ఉ. ఆపుర మేలు ‘ మేలు, బళి ’ యంచుఁ బ్రజల్ జయవెట్టుచుండ, నా
జ్ఞాపరిపాలనవ్రతుఁడు,
శాంతిదయాభరణుండు సత్యభా
షాపరతత్త్వకోవిదుఁడు, సాధుజనాదరణుండు
దానవి
ద్యా పరతంత్ర మానసుఁడు ధర్మతనూజుఁ డుదగ్రతేజుఁ డై.
ధర్మరాజు సకలగుణ సంపన్నుడు. అయినా
కూడా మొట్టమొదటగా "ఆజ్ఞాపరిపాలనా వ్రతుడు" అని చెప్పడంలో గొప్ప విశేషం
ఉంది. సాధారణంగా రాజులు చేసే ఆజ్ఞలు సామాన్యులైన ప్రజలకోసమే. ప్రజలు పాటించడానికే అన్నట్టు
ఉంటాయి. అవి పాలకులకు వర్తించవు. ప్రతీ పాలనలో ఇది సర్వసాధారణమని గమనించిన కవి
ధర్మరాజు మాత్రం తన ఆజ్ఞలను తాను కూడా పాటిస్తూ శాంతి, దయ అన్న మహా గుణాలను ఆభరణాలుగా ధరించినవాడు. సత్యాన్ని పలుకడంలో ఉన్న
ఉత్కృష్టమైన స్వరూపాన్ని తెలుసుకున్నవాడు. దానం చేయడమనే విద్యలో ఆసక్తి
కలిగినవాడు. మంచివారిని సదా ఆదరించేవాడు. మిక్కిలి పరాక్రమవంతుడు, యమధర్మరాజు తనయుడైన ధర్మరాజు ప్రజలందరూ జయజయధ్వానాలు చేస్తుండగా
ఇంద్రప్రస్థాన్ని జనరంజకంగా పరిపాలిస్తుండేవాడు. అసలు సంగతి ఏంటంటే ఈ లక్షణాలన్నీ
కవి రఘునాధనాయకుడికి కూడా వర్తింప చేస్తున్నాడు.
శా. దేవబ్రాహ్మణభక్తి ప్రోవు ప్రియవక్తృత్వంబుకాణాచి, వి
ద్యావైదుష్యముదిక్కు, ధర్మమునకుం
దార్కాణ, మర్యాదకున్
ఠా, వౌచిత్యము జీవగఱ్ఱ,
హితశిష్టవ్రాతసంతోషణ
శ్రీవజ్రాంగి యజాతశత్రుఁడు
మహీభృన్మాత్రుఁడే చూడఁగన్
ధర్మరాజు దేవతలనూ, బ్రాహ్మణులను సమానమైన భక్తితో
గౌరవిస్తాడు. అందరితో చాలా ప్రియంగా మాట్లాడతాడు. కటువుగా మాట్లాడి ఎరుగడు. వివిధ
విద్యలలో ప్రావీణ్యులైనవారిని ఆదరించి సత్కరించేవాడు. ధర్మాన్ని తప్పక
నిర్వహించడమే ఆదర్శంగా కలవాడు. సభ్య ప్రవర్తనకు నిలయమైనటువంటివాడు. స్నేహితులను,
సజ్జనులను సంతోషపెట్టాలనే మంచి బుద్ధిని వజ్రకవచంగా ధరించివాడు, అజాతశత్రువైన ధర్మరాజు సాధారణ మహారాజు కాదు సుమా అని కవి భావము.
ధర్మరాజుకున్న పేర్లలో అజాతశత్రువన్ని ప్రముఖమైనది. అంటే అతనికి శత్రువన్నవాడు
పుట్టలేదు అన్నమాట. వజ్రకవచమంటే వజ్రాలతో చేసిన కవచమో, వజ్రాలు తాపడం చేసిన కవచమో అన్న అర్ధం స్ఫురిస్తుంది. కాని ఇది ఒక
పలుకుబడి మాత్రమే. వజ్రం లాంటి దృడత్వం కల బుద్ధి కలవాడు ధర్మజుడు.
ఉ. కోప మొకింత లేదు: బుధకోటికిఁ
గొంగుఁబసిండి: సత్య మా
రూపము తారతమ్యము లెఱుంగు: స్వతంత్రుఁడు:
నూతనప్రియా
టోపము లేని నిశ్చలుఁ డిటుల్ కృతలక్షణుఁ
డై చెలంగఁగా
ద్వాపరలక్షణుం డనఁగ వచ్చునొకో యల
ధర్మనందనున్?
యుగాలకు అనుగుణంగా మనుష్యుల స్వభావము, ప్రవర్తన కూడా వేరువేరుగా ఉంటుందంట. కృతయుగంలో మనుష్యులు
కోపమనేది లేకుండా, పండితులను, అవసరార్ధం వచ్చినవాళ్లకు అన్నివేళలా అందుబాటులో ఉండే కొంగుబంగారమై
ఆదరిస్తూ, మూర్తీభవించిన సత్యభాషణులు, మనుష్యులలో పెద్దా, చిన్నా అనే
తారతమ్యాలు చూడనివాళ్లు, తమ క్రింద పని చేసేవారి సలహాల మీద మాత్రమే ఆధారపడి నిర్ణయాలు
తీసుకోకుండా స్వయంగా తెలుసుకుని మరీ పూర్తి చేసే సమర్ధులు, తమకు తారసిల్లే
వ్యక్తులు కొత్తైనా, పాతదైనా చపలత్వం లేకుండా సమానంగా ప్రవర్తించేవాళ్లు.. ఇటువంటి ప్రత్యేకమైన,
ప్రసిద్ధమైన కృతయుగపు లక్షణాలు కలిగినవాడు
యమధర్మరాజు పుత్రుడైన ధర్మరాజు. కాని అతను ద్వాపరయుగంలో ఉన్నవాడు కాబట్టి
ద్వాపరలక్షణుడు అని అనలేము ఎందుకంటే ద్వాపరలక్షణుడు సందిగ్ధమైన గుణాలు కలిగినవాడు.
ఆ గుణాలేమీ ధర్మరాజుకు లేవు..
క. పంచామరతరులో! హరి
పంచాయుధములో! గిరీశు పంచాస్యములో!
యంచున్ సకలజనంబులు
నెంచన్ బాండవులు వెలసి రేవురు ఘను లై
పంచపాండవులు ఐదుగురూ దానబుద్ధి కలిగి,
కోరిన కోరికలు తీర్చే మందారము, పారిజాతము, సంతానము, కల్పవృక్షము, హరిచందనము మొదలైన అయిదు దేవతా వృక్షాలో, యుద్ధాలలో విజయాలను సాధిస్తూ, ఎల్లప్పుడు విజయాలను అందించే పాంచజన్యము (శంఖము), సుదర్శనము (చక్రము)కౌమోదకి (గద), నందకము (ఖడ్గం) శార్ జ్గము (విల్లు) మొదలైన విష్ణువు ఆయుధములో,
తమ ప్రవర్తనతో మహాపవిత్రములైన సద్యోజాతము,
వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము మొదలైన ఈశ్వరుని పంచాస్యములో అన్నట్టుగా సందేహించేవారు ప్రజలందరూ. కవి భావనలో కోరిన కోర్కెలు
తీర్చడంలోనూ, శత్రువులను జయించడంలోనూ, పవిత్రమైన ప్రవర్తనలోనూ పంచపాండవులందరూ గొప్పవారు అని అర్ధం.
ఉ..అన్నలపట్లఁ దమ్ముల యెడాటమునన్ సముఁ డంచు
నెన్నఁగా
నెన్నిక గన్న మేటి, యెదు రెక్కడ లేక
నృపాలకోటిలో
వన్నెయు వాసియుం గలిగి వర్తిలు పౌరుషశాలి:
సా త్త్వికుల్
తన్ను నుతింపఁగాఁ దనరు ధార్మికుఁ
డర్జునుఁ డొప్పు నెంతయున్.
అర్జునుడు తన కంటే పెద్దవాళ్లైన
ధర్మరాజు, భీముడి పట్ల అణకువతో ఉంటూ, చిన్నవాళ్లైన నకుల, సహదేవులతో
అధికారం చలాయించకుండా ప్రేమతో ఉండేవాడు. ఎప్పుడు కూడా అన్నలపైనా, తమ్ముళ్లపైనా
సమబుద్ధితో మెలిగేవాడు. అన్నవైపు లెక్కపెడితే ఇద్దరు, తమ్ముళ్లు
ఇద్దరు ఉన్నారు. ఎటువైపునుండి లెక్కపెట్టినా అర్జునుడు పాండవమధ్యముడే అని చమత్కరిస్తుంటారు. అతన్ని
ఎదిరించి నిలువరించగలిగినవాడు ఈ భూమి మీద లేడని శూరులు పొగుడుతారు. అంతే కాక
సత్వగుణం కలవాడని ధర్మనిరతుడని ప్రశంసిస్తుంటారు. ధర్మం, వీరత్వం
రెండింటిలోనూ సమానమైన పేరు ప్రతిష్టలు కలిగినవాడని అందరూ ఒప్పుకుంటారు.
చ. అతని నుతింప శక్యమె? జయంతుని
తమ్ముడు సోయగంబునన్
బతగకులాధిపధ్వజుని ప్రాణసఖుండు
కృపారసంబునన్,
క్షితిధరకన్యకాధిపతికిన్ బ్రతిజోదు
సమిజ్జయంబునం,
దతని కతండె సాటి చతురభ్ధిపరీతమహీతలంబునన్.
వీరుడైన అర్జునుడి గుణగణాలు పొగడానికి
ఎవరికైనా సాధ్యమా? ఎందుకంటే అతడు అందంలో ఇంద్రుడి కొడుకు
జయంతుడికి తమ్ముడు. ఇక్కడ పోలిక కోసమే కాక వేరొక మాట చెప్పుకోవచ్చు. జయంతుడు
ఇంద్రుడి కొడుకు. అదేవిధంగా అర్జునుడు కూడా ఇంద్రుని వరప్రసాదంతో కుంతికి పుట్టినవాడు
కావున అతను కూడా ఇంద్రపుత్రుడే. ఈ వరుసలో జయంతుడు, అర్జునుడు అన్నదమ్ములు అవుతారు. అందుకే కవి అర్జునుడిని అందానికి ప్రసిద్ధి పొందిన జయంతుని తమ్మునిగా
అభివర్ణించాడు. అర్జునుడు దయాగుణంలో పక్షులజాతికి అధిపతియైన గరుత్మంతుడి ద్వజముగా
కలిగిన శ్రీమహావిష్ణువు(కృష్ణుడు)కు ప్రాణస్నేహితుడు. దయారసంలో లోకాలను రక్షించి, పోషించే
మహావిష్ణువు సుప్రసిద్ధుడు. ఆ విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడికి ద్వాపరయుగంలో ప్రాణసఖుడు
అర్జునుడు. ఈ నేస్తం నరనారాయణ కాలం నుండి వస్తున్నది. ఇక అర్జునుడి పరాక్రమం జగమెరిగినదే. అతను
యుద్ధం చేసిన ప్రతీసారి విజయంతో తిరిగివచ్చేవాడు. విజయుడని కూడా పేరు పొందినవాడు.
కవి ఇక్కడ అర్జునుడి పరాక్రమాన్ని త్రిపుర సంహారం చేసిన ఈశ్వరుడితో
పోలుస్తున్నాడు. కిరాతార్జునీయం ఘట్టంలో అర్జునుడు ఈశ్వరుడికి సరిజోడీగా
పోరాడి పాశుపతాస్త్రం సంపాదించాడు. నాలుగు సముద్రముల చేత చుట్టబడిన భూమండలంలో
అతడికి అతడే సాటి. అతనిని గెలువగలిగేవారు ఎవ్వరూ లేరు. ఈ పద్యంలో కవి అర్జునుడిని
జయంతుడిని, విష్ణువును, శివుని పోలినవాడు అనడానికి తమ్ముడు, ప్రాణసఖుడు, ప్రతిజోదు అని
వారి వారి పురాణసంబంధాలను సూచించే పదాలనే ఉపయోగించాడు. ఇంత గొప్పవారితో పోల్చిన
కవి అర్జునుడిని ఇలలో గెలవ ఎవరికీ సాధ్యం కాదు అని కూడా చెప్పడం జరిగింది. పై
పద్యంలో పోలికలు తెచ్చిన జయంతుడు స్వర్గంలోనివాడు, విష్ణువు వైకుంఠంలోనివాడు, ఈశ్వరుడు కైలాసంలోనివాడు.
ముగ్గురు కూడా ఈ లోకానికి చెందిన వారు కాదు. అందుకే నాలుగు సముద్రాలతో చుట్టబడిన
భూమండలంలో అతనికి సాటి అని చెప్పదగినవాడు లేదు. అతనికతనే సాటి.. అని చమత్కరించాదు
కవి..
ఉ. ప్రాయపుఁడెక్కునన్ జెలువపల్కులు
చిల్కల గారవించుఁ గ
న్దోయి చకోరపాళి దయతోఁ బెనుచుం: జనుకట్టు
మచ్చికల్
సేయు సదా రథాంగయుగళి: న్నడ లంచల
బుజ్జగించు నౌ
నేయెడ నింపు గావు గణియింప
నవీనవయోవిలాసముల్?
అర్జునుడి తర్వాత కధలో సుభద్ర పాత్ర ప్రవేశం
చేస్తుంది. యవ్వనంలో కలిగే అతిశయం చేత సుభద్ర మాటలు చిలుకలను ఆదరిస్తాయి. ఆమె కన్నులేమో
చకోరాలను పెంచుతున్నాయి. స్తనముల కుదురు జక్కవ పిట్టలను మచ్చిక చేస్తుంది. ఇక ఆమె
నడకేమో హంసలను లాలన చేస్తుంది. వయసులో ఉన్నవారికి ప్రతీది,
ప్రకృతి, పక్షులు కూడా ప్రియంగా, ఇంపుగా
ఉంటాయన్నది తెలిసిన విషయమే... ఇంతకు ముందు
పద్యంలో అర్జునుడికి సామ్యాన్ని చూపించిన కవి ఈ పద్యంలో నిరూపిస్తున్నది ఆధిక్యము.
సాధారణంగా స్త్రీల పలుకులు చిలుక పలుకుల్లా ఉన్నాయంటారు కాని ఇక్కడ సుభద్ర పలుకులు
చిలుకల పలుకులను ఆదరిస్తున్నాయి. ఆమె కన్నులు అందములో ఆధిక్యం చూపుతూ చకోరపక్షులను
దయతో పెంచుకున్నాయి, చనుకట్టు ఆకారసౌష్టవాలలో
జక్కువపక్షులను మచ్చిక చేసుకుని తన దగ్గరే ఉంచుకుంటుంది. ఆమె వయ్యరపు నడక మాత్రం
తక్కువా? తన ఆధిక్యంతో హంసలను లాలన చేస్తుంది. ఈ పోలికలను మరి కొంచం విడమర్చి
చదువుకుంటే ఏ చెట్టు మీదనో, అడవిలోనో ఉండే చిలుకలను ఆదరించి
పంజరంలో ఉంచడం అనేది గురువు శిష్యుని ఆదరింఛినట్టుగా ధ్వనిస్తుంది. అలాగే చంద్రుడి కోసం వేచి వేచి
వెన్నెలలను తిని బ్రతికే చకోరపక్షులను పోషించి పెంచుతున్నదంట.. దీనులను, ఆర్తులను పోషించినట్లుగా అని స్ఫురిస్తుంది.. సాయంత్రమయ్యేసరికి
జోడునుండి విడిపోయి వియోగబాధను పొందే జక్కవ పక్షుల జంటను మచ్చిక చేసి, విడిపోకుండా ఉంచుతుంది ఆమె స్తనాల కుదురు.. వయ్యారపు నడకలకు
ప్రతిరూపాలైన హంసలను తొందరపడవద్దని లాలన చేస్తుందన్నట్టుగా ఆమె నడక.
తొందరపడేవాళ్లని మందలించినట్టు అని ధ్వనిస్తుంది.
చ. అతివకుచంబులు, న్మెఱుఁగుటారును,
వేనలియున్, ధరాధిపో
న్నతియు నహీనభూతికలనంబు, ఘనాభ్యుదయంబు
నిప్పుడొం
దితి మని మాటిమాటికిని నిక్కెడు
నీల్గెడు విఱ్ఱవీఁగెడున్:
క్షితి నటు గాదె యొక్కొకరికి
న్నడుమంత్రపుఁగల్మికల్గినన్.
సాధారణమైన మధ్యతరగతి జీవితం గడిపే మనుషులు నడమంత్రపు సిరి రాగానే గర్వంతో
విర్రవీగుతారంట. అలాగే సుభద్ర
పుట్టినప్పుడు లేని శోభ అందం, ఈ యవ్వనంలో కలిగి ఆమె స్తనాలు, నూగారు, కొప్పు వరుసగా నిక్కుతూ, నీల్గుతూ, విర్రవీగుతూ
ఉన్నాయంట. మాటకు మాట అనగా కుచములు నిక్కుతో పొడుచుకొని ఉన్నాయి. నూగారు నీల్గుచూ
నాభినుండి సాగి కనపడుతుంది. కొప్పు కూడా కింద మీద అయి విరగబడుంది..
0 వ్యాఖ్యలు:
Post a Comment