గత టపాలో కవి ధర్మరాజు, సుభద్రార్జునులను పరిచయం చేసాడు.
ఇప్పుడు కధానాయిక సుభద్ర అందచందాలను, నాయకుడు అర్జునుడి గురించి మరిన్ని విశేషాలు...
కేళికాసరసిలోఁ దేలియాడుటఁ జేసి
శైవాల లత కొంత సాటివచ్చుఁ
బుష్పమాలికలతోఁ బొందు సల్పుటఁ జేసి
యెలదేఁటి గమి కొంత యీడు వచ్చుఁ
గంటి కింపగు రేఖ గలిగి యుండుటఁ జేసి
మినుకుఁ గాటుక కొంత దినుసు
వచ్చుఁ
బిఱుఁదు నొయ్యారంబు మెఱయుచుండుటఁ జేసి
చమరివాలము కొంత సమము వచ్చుఁ
గాక నీలత్వమున సరి గావు తెలియ
నెఱిగలిగి యొక మొత్తమై నిడుదలై
ద
ళమ్ములై మెర్గులై కారుక్రమ్ముచున్న
వికచకమలాక్షి నును సోగ వెండ్రుకలకు
శ్రవ్యకం : నారాయణస్వామి
సరస్సులో జలకాలాడుతున్న సుభద్ర
తలవెంట్రుకలు ఆ నీటిమీద తేలియాడుతున్న నాచుతీగలా మెలికలు తిరిగి ఉన్నాయంట.
తుమ్మెదలు ఎప్పుడూ పువ్వులతో కలసి ఉంటాయి
అలాగే సుభద్ర కొప్పులో ఎప్పుడు పూలు ధరించి ఉంటుంది కాబట్టి ఆ పోలిక చెప్పవచ్చు.
సుభద్ర జుట్టు నల్లగా కంటికి ఇంపుగా కాటుకలా ఉంటుంది. మరింత అందంగా కనిపిస్తుంది.
ఇక్కడ కంటి అందాన్ని ఇనుమడింపజేయడానికి కాటుక వాడతారు అలాగే కొప్పు కూడా కంటికింపుగా ఉంటుంది. అందుకే
ఈ పోలిక..సుభద్ర జడ వెనుకవైపు చామరంలా
వయ్యారంగా, అందంగా ఉంది. ఇలా సుభద్ర తలవెంట్రులకు
నాచుతీగ, తుమ్మెదలు, కాటుక, చామరములతో సమాన గుణాలు ఉన్నాయని
చెప్పడం వల్ల అవి చాలా చిన్న పోలికలే కాని పాము నడకలా వంకరలు కలిగి, పొడవుగా, ఒత్తుగా గుంపుగా ఉండి, దట్టంగా ప్రకాశిస్తూ, నల్లని కాంతిని వ్యాపింపజేస్తున్న
వికసించిన పద్మమువంటి కన్నులు కలిగిన సుభద్ర నున్నగా, నల్లగా ఉన్న తలవెంట్రుకల నలుపు కాంతియందు సాటి కాజాలవు. ఇక్కడ సుభద్ర
తలవెంట్రుకలను పోల్చిన ఉపమానాలన్నింటిలోనూ కొంచెం సమానత్వం ఉన్నా కూడా ఆమె కొప్పు
అత్యధిక నీలత్వము కలిగి ఉంది అని కవి భావన..
జలరుహగంధి వీనుల పసల్ నవసంఖ్య నదేమి
లెక్కనున్
జెలియ నఖాంరురాళి నెలచేడియ సైకముఁ దా నుజుక్కనున్
బొలఁతుక గబ్బిచన్నుఁగవ పువ్వులచెండ్లను
లేదు బంతనున్
గలికిముఖారవింద మల కల్వలరాయనిఁ ద్రోసిరాజనున్
శ్రవ్యకం : నారాయణస్వామి
శ్రవ్యకం : నారాయణస్వామి
పద్మములాంటి సువాసనలు వెదజల్లే శరీరము
కలిగిన సుభద్ర చెవుల అందం తొమ్మిది సంఖ్యను లెక్క చేయక అది ఏపాటిది? అని తిరస్కరిస్తుందంట. అంటే ఆమె చెవులు తొమ్మిది అంకెకంటే ఎక్కువ
ఆకారసౌష్టవం కలిగి ఉన్నాయి. ఆమె చేతివేళ్ల గోర్ల వరుస చంద్రుని భార్య తారను కూడా ఓ చుక్కా అని
తిరస్కరిస్తుందంట. అంటే ఆమె గోర్లు తారల(చుక్కల)కంటే అందంగా, మెరుస్తూ ఉన్నాయి. ఆమె బిగువైన చనుదోయి పూవుల చెండ్లను(బంతులను)
కూడా మీలో ఏ విశేషము లేదు సుమా అని
తిరస్కరిస్తున్నాయి. అంటే ఆమె స్తనములు పూల బంతులకంటే ఎక్కువ అందంగా, బిగువుగా ఉన్నాయి. పద్మములాంటి వదనం కూడా అందానికి పేరుపొందినవాడు, కలువల రాజైన చంద్రుని కూడా రాజే కదా అని తిరస్కరిస్తుందంట. అంటే ఆమె
ముఖము కూడా ఆ చంద్రుని కంటే మనోహరంగా ఉంది. ఈ పద్యంలో సుభద్ర చెవులు తొమ్మిది అంకెకంటే, గోర్లు నక్షత్రాలకంటే, స్తనములు
పూలచెండ్లకంటే, ముఖము చంద్రునికంటే ఎక్కువ అందంగా
ఉన్నాయని, పోలికలు చెప్తూనే సుభద్ర అందం ముందు
అవేమంత గొప్పవి కావని కవి భావన..
కడు హెచ్చు కొప్పు దానిన్
గడవం జనుదోయి హెచ్చు కటి యన్నిటికిన్
గడు హెచ్చు హెచ్చు లన్నియు
నడుమే పస లేదు గాని నారీమణికిన్
శ్రవ్యకం : నారాయణస్వామి
శ్రవ్యకం : నారాయణస్వామి
వనితలలో రత్నమువంటిదైన సుభద్రకు జుట్టు
చాలా పెద్దది. దానిని మించినది ఆమె చనుకట్టు ఇంకా పెద్దది. ఆపై జఘనము కూడా ఇంకా
పెద్దది. ఆమె శరీరంలోని ఇవన్నీ పెద్దవే కాని నడుమే చాలా చిన్నది. ఏ వస్తువైనా ,
విషయమైనా పెద్దది అని చెప్పడానికి పోలిక
తీసుకువస్తారు కాని సుభద్ర శరీరంలోని అందాలు ఒకదానికంటే ఇంకొకటి ఆధిక్యం కలిగి
ఉన్నాయి. కాని నడుమే చాలా సన్నగా ఉండి పసలేదని చెప్తున్నాడు కవి. స్త్రీలకు నడుము
సన్నగా ఉంటేనే అందం అనే సాధారణ విషయాన్ని ఇంతందగా కవి వర్ణిస్తున్నాడు. ఎక్కువగా
ఉన్నవి, తక్కువగా ఉన్నవి కూడా ఆమె
అందానికి మరింతగా వన్నె తెస్తున్నాయంట.
అంగము జాళువా పసిఁడి యంగము
క్రొన్నెలవంక నెన్నొసల్
ముంగురు లింద్రనీలముల ముంగురు లంగజు డాలు
వాలుఁ జూ
పుంగవ, యేమి చెప్ప! నృపపుంగవ, ముజ్జగ
మేలఁ జేయు న
య్యంగనఁ బోలు నొక్క సకియం గనఁబో,
నెఱిమించ నన్నిటన్
శ్రవ్యకం: నారాయణస్వామి
ఆ సుభద్ర యొక్క మేను జాళువాదేశపు మేలిమి బంగారపు తునక, విదియనాటి కొత్త చంద్రవంక వలెనున్న ఆమె అందమైన నుదురు, నుదురు మీద పడుతున్న తలనీలాలు, ఇంద్రనీలాలను పోలియుండగా , ఆమె సోగ కన్నులజంట మన్మధుని కేతనమును స్ఫురింపజేయగా ఇంకేమి చెప్పగలను. అంటే మన్మధుడిని మీనకేతనుడని కూడా అంటారు. ఇటువంటి శుభకరమైన లక్షణములను గమనిస్తే ఆమె భర్త చక్రవర్తి అవుతాడని , మూడు లోకాలను పరిపాలిస్తాడని ఖచ్చితంగా నిర్ణయించవచ్చు. ఇటువంటి సుందరిని నేను ఇక ముందు కూడా చూడబోను అని కవి భావము.
ఆ సుభద్ర యొక్క మేను జాళువాదేశపు మేలిమి బంగారపు తునక, విదియనాటి కొత్త చంద్రవంక వలెనున్న ఆమె అందమైన నుదురు, నుదురు మీద పడుతున్న తలనీలాలు, ఇంద్రనీలాలను పోలియుండగా , ఆమె సోగ కన్నులజంట మన్మధుని కేతనమును స్ఫురింపజేయగా ఇంకేమి చెప్పగలను. అంటే మన్మధుడిని మీనకేతనుడని కూడా అంటారు. ఇటువంటి శుభకరమైన లక్షణములను గమనిస్తే ఆమె భర్త చక్రవర్తి అవుతాడని , మూడు లోకాలను పరిపాలిస్తాడని ఖచ్చితంగా నిర్ణయించవచ్చు. ఇటువంటి సుందరిని నేను ఇక ముందు కూడా చూడబోను అని కవి భావము.
ఒక భూమీదివిజుండు చోరహృతధేనూత్తంసుఁడై
వేఁడికొం
టకుఁ దా ధర్మజు కేళిమందిరముదండం బోయి
కోదండసా
యకముల్ దెచ్చుటఁ బూర్వక్ఌప్తసమయన్యాయానుకూలంబుగా
నొకయేఁ డుర్విప్రదక్షిణం బరుగు
నుద్యోగంబు వాటిల్లినన్
శ్రవ్యకం : నారాయణస్వామి
శ్రవ్యకం : నారాయణస్వామి
ఒక బ్రాహ్మణుడి తన గోవును దొంగలు అపహరించారని మొరపెట్టుకోగా అర్జునుడు ఆ దొంగలను ఎదిరించి,
సంహరించి ఆవును తీసుకురావడానికి తన బాణము,
విల్లూ తీసుకోవడానికి ధర్మరాజు, ద్రౌపది ఉన్న మందిరంలోకి వెళ్లడం వలన ఒక సంవత్సరం భూప్రదక్షిణం చేయవలసి వచ్చింది. ద్రౌపది పంచపాండవులకు
భార్యగా మారినప్పుడు నారద మహర్షి సలహా ప్రకారము ఆమె ఒకరితో ఉన్న సమయంలో తక్కిన
నలుగురిలో ఎవరుకూడా వారి ఏకాంతానికి భంగము
కలిగించరాదని నియమం చేసుకున్నారు. ఆ నియమాన్ని అతిక్రమించినవారు ఒక సంవత్సరం
రాజ్యమును విడిచి భూప్రదక్షిణ చేయాలి. ఈ నియమం ప్రకారం అర్జుణుడికి సుభద్రను
పెళ్ళి చేసుకునే గొప్ప యోగం కూడా కలిగింది. అర్జుణుడి నియమ అతిక్రమణ ముందు ముందు
జరగబోయే సుభద్రా పరిణయాన్ని సూచిస్తుందంటాడు కవి.
పరిణయ మౌట కేఁగుగతిఁ బౌరు లనేకులు
వెంటరా శుభో
త్తరముగ నయ్యెడం గదలి తద్దయుఁ దాలిమి
మీఱ ధర్మత
త్పరుఁడయి యందునందు నులుపాలు నృపాలు రొసంగఁ గా నిరం
తరమును బుణ్యతీర్థములఁ దానములాడుచు
నేఁగి యవ్వలన్
ప్రతిజ్ఞా భంగం చేసినందుకు రాజరికాన్ని
వదిలి తీర్థయాత్ర చేయవలసి వచ్చినా అది అర్జునుడి కళ్యాణము కొరకే అన్నట్టు మారింది.
సకల పురజనులు, సేవకులూ, బ్రాహ్మణులూ, ప్రయాణంలో అవసరముండే వస్తువులతో,
అర్జునుడు తీర్థయాత్రకు కాక తన పెళ్లి
చేసుకోవటానికి సంతోషంగా తరలి వెళుతున్నటుగా పుణ్యతీర్థాలు సందర్శించడానికి
బయలుదేరాడు. తన యాత్రను ఒక శుభముహూర్తంలో
ప్రారంభించి, దారిలో సామంత రాజులు ఇచ్చే కానుకలను
స్వీకరిస్తూ పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ , వెళ్తూ... నియమ భంగం ఐనా ఈ
ప్రయాణ ఫలితం మూడు కళ్యాణాలు కాబట్టి కవి ముందుగానే "పరిణయమౌట కేఁగు గతి" అని సూచిస్తున్నాడు. సుభద్రను
కలవాలని ఎంత ఆత్రుతగా ఉన్నా ధర్మతత్పరుడు కాబట్టి అర్జునుడు
ఓర్పుతో పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ సాగిపోతున్నాడు.
సునాసీర సూనుండు సూచె న్నిమజ్జ
జ్జనౌ ఘోత్పత త్పంక శంకాక రాత్మో
ర్మి నిర్మగ్న నీరేజ రేఖోన్నమ ద్భృం
గ నేత్రోత్సవ శ్రీని, గంగాభవానిన్.
పవిత్రమైన గంగానదిలో స్నానం చేస్తే
సకలపాపాలూ తొలగిపోతాయని అనాదిగా ఉన్న
నమ్మకం. సాధారణంగా తామరపువ్వులు నీళ్లలో
పైకి కనిపిస్తూ ఉంటాయి. అలలు కదిలినపుడు ఆ తామరపువ్వులు కూడా కదిలి వాటిమీద ఉన్న
తుమ్మెదలు ఎగిరిపోతాయి. తుమ్మెదలూ,
పాపాలు నలుపు రంగులోనే ఉంటాయి. అందుకే
గంగానదిలొ ఉన్న తామరపువ్వుల మీద ఉన్న తుమ్మెదలు ఎగిరిపోతుంటే ఆ నదిలొ స్నానం
చేసినవారి పాపాలు ఎగిరిపోతున్నాయా అన్న భ్రాంతిని కలిగిస్తున్న గంగాదేవిని
అర్జునుడు చూసాడు. ఇంత చక్కని
ప్రకృతివర్ణనతో నేత్రోత్సవం కాకుండా ఉంటుందా...
పెల్లుసెగఁ జల్లు విస మా
తెల్లనిదొర కుతికమోవఁ దిని బ్రతుకుట నీ
చల్లదనంబునఁ గాదే
కల్లోలవతీమతల్లి గంగమ తల్లీ
తెల్లనివాడైన ఈశ్వరుడు కాలకూఠాన్ని
సేవించి దాన్ని గొంతులోనే ఆపేసి నీలకంఠుడయ్యాడు. విషము ఎప్పుడూ అగ్నిజ్వాలలను
కక్కుతూ వేడిగా ఉంటుంది. కాని శీవుడి నెత్తిమీద గంగమ్మ ఉండడం వల్ల అతన్ని చల్లగా ఉండేలా చేస్తుంది అని కవి వర్ణిస్తున్నాడు.
కంఠాన మండుతున్న విషాన్ని దాల్చిన నెత్తిన భార్య యైన గంగాదేవి చల్లగా ఉంచుతుంది.
సాధారణంగా భర్త ఆయురారోగ్యాలను తన మాంగల్య మహిమతో భార్య కాపాడుతుందని ప్రతీతి.
ఇక్కడ కూడా ఈశ్వరుడు తన భార్య గంగాదేవి మూలంగానే బ్రతికి ఉన్నాడు అంటాడు కవి. అందుకే ఆమె అన్ని నదులలోకెల్లా శ్రేష్టురాలైనది. పవిత్రమైనది..
పువ్వారుఁ బోఁడివై సరి
యెవ్వా రన భీష్ముఁ గాంచి యింపొందితి వీ
వవ్వాని యెఱుఁగుదువె మా
యవ్వా, పోషింపఁ బాడి యగు నను నీకున్
గంగను జలమయమైన నదీరూపంగా భావిస్తారు.
పూజిస్తారు. కాని ఇక్కడ అర్జునుడు అవ్వా అని సంబోధిస్తున్నాడు. దానికి తగిన ఆధారం
కూడా ఉంది. నదీరూపంలా కాకుండా పూవులాగా కోమలమైన శరీరముగల సుందరాంగి రూపంలో
గంగాదేవి శంతనుడిని వివాహం చేసుకుని, శాపగ్రస్తులైన
అష్టవసువులను పుత్రులుగా కన్నది. వారిలో చివరివాడు భీష్ముడు. అతనిని మనవడే
అర్జునుడు. ఆ వరసతో గంగాదేవి అర్జునుడికి ముత్తవ్వ అవుతుంది. తన గురించి ఆమెకు
తెలియదేమో అని ఇలా గుర్తు చేస్తూ తన భక్తిని మాత్రమే చూడక, బంధుత్వము కూడా చూసి తనను కాపాడాలని గోముగా అడుగుతున్నాడు అర్జునుడు.
పూవులాంటి కోమల దేహము కలిగిన దానివైనా, అరివీర
భయంకరుడైన భీష్ముడిని కన్న నీకు సరి ఎవరున్నారని కవి చమత్కరిస్తున్నాడు.